మిస్ వరల్డ్ అందాల పోటీలు, మార్కెట్ రాజకీయాలపై రౌండ్ టేబుల్ సమావేశం..
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న అందాల పోటీలను బహిష్కరించండి!
——————————————————————-
సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్:( జై భీమ్ న్యూస్ టుడే)
72వ మిస్ వరల్డ్ అందాల పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసినదే. మహిళల శారీరక కొలతలు, అంగాంగ ప్రదర్శనలు చేసే వేదికలుగానే ఈ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీలు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నాయి. వారిని మార్కెట్లో ఒక వస్తువుగా దిగజార్చే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో “అందాల పోటీలు- మార్కెట్ రాజకీయాలు” అనే అంశం పైన ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మేధావులు, రచయిత్రులు కళాకారులు, ప్రజాస్వామ్య వాదులు హాజరయ్యారు.
ఇటీవల మిస్ ఇంగ్లాండ్ “మిల్లా మాగీ” సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “అందాల పోటీలో పాల్గొంటున్న వారిని ఎగ్జిబిషన్లో బొమ్మలుగా చూశారని” సంచలన ఆరోపణ చేశారు. నిర్వాహకులతో, అతిధులతో గంటల తరబడి గడపాలని, వారి ముందు ర్యాంప్ వాక్ చేయాలని, ఎప్పుడూ బాల్ గౌన్ ధరించాలని తమను ఒత్తిడి చేశారని ఆమె బాధను వ్యక్తం చేశారు. ఆ సమయంలో తానొక వేశ్యనా! అనే భావన కలిగిందంటూ ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేకనే అందాల పోటీల నుండి వైదొలిగినట్లు ప్రకటించింది. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మిల్లా మాగీని యావత్ మహిళా లోకం అభినందించాలి.
ఈ అందాల పోటీల తెరవెనుక ప్రయోజనాల గురించి చాలాకాలంగా మహిళా సంఘాలు చెబుతున్న విషయాలనే మిల్లా మాగీ ప్రకటన ధృవీకరించింది. పత్రికలు, మీడియాలో అందమైన కథనాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ పోటీల్లో అశ్లీలత, అసభ్యత, అనైతికత ఉంటుందని ఇప్పుడు తేట తెల్లమైంది. దీంతో కంగుతిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమె ఆరోపణలు వాస్తవం కాదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. మహిళల ఆత్మగౌరవానికి ఈ అందాల పోటీలు ప్రతీక అనీ, ప్రపంచ పటంలో తెలంగాణ పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా నిలుస్తాయని ప్రభుత్వం చెబుతున్నా… మిల్లా మాగీ ఆరోపణలతో ఈ పోటీల డొల్లతనం బట్టబయలైంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, చేనేత పరిశ్రమకు చేయూత ఇచ్చేందుకు, పర్యాటక రంగం అభివృద్ధికి ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ పోటీల అసలు ఉద్దేశం కాస్మొటిక్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదించుకునే అవకాశం కల్పించడమే. ఇలాంటి అందాల పోటీలను రద్దు చేయాలంటూ ఏర్పడిన మహిళా, విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్లు, కార్యాలయాల్లో నిర్బంధించారు. అందాల పోటీలకు వ్యతిరేకంగా కొద్దిరోజులుగా జరుగుతున్న ఐక్యవేదిక నిరసనలను రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణిచివేస్తోంది. మిల్లా మాగీ విమర్శల తర్వాతైనా ప్రభుత్వం అందాల పోటీల పై పునరాలోచన చేయాలి. ఈ నెల 31న జరిగే గ్రాండ్ ఫినాలేని రద్దు చేయాలి.
- మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న అందాల పోటీలను బహిష్కరించండి!
- మహిళలను మార్కెట్ వస్తువుగా దిగజారుస్తున్న అందాల పోటీలను రద్దు చేయాలి!
ఇట్లు
మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక
More Stories
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో సమావేశం అయిన శాంతి చర్చల కమిటీ నేతలు.
కాశ్మీర్ లోయలో పర్యాటకులపై టెర్రరిస్టుల కాల్పులను ఖండిస్తూ హైదరాబాద్ విద్యానగర్ చౌరస్తాలో PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టెర్రరిస్టుల దిష్టిబొమ్మ దహనం…
కామ్రేడ్ పైలా వాసుదేవరావు ఆశయ సాధనకై పోరాడాలి సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు