శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో లెఫ్ట్‌ ప్రభంజనం

Spread the love

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో లెఫ్ట్‌ ప్రభంజనం

జెవిపి నేతృత్వ కూటమికి మూడింట రెండొంతుల మెజార్టీ

తమిళ ప్రాబల్య ప్రాంతాల్లోనూ కొనసాగిన జోరు

ప్రత్యర్థి కూటమిలో మట్టి కరచిన హేమాహేమీలు

 

కొలంబో: శ్రీలంక మరో చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన 10వ పార్లమెంటు ఎన్నికల్లో జనతా విముక్తి పెరమున (జెవిపి) నేతృత్వంలోని వామపక్ష కూటమి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పిపి)కి ప్రజలు మూడింట రెండొంతుల మెజార్టీతో అఖండ విజయం చేకూర్చారు. ఎన్నికల సంఘం వెల్లడించినదాని ప్రకారం మొత్తం 225 స్థానాలు ఉన్న పార్లమెంటులో 159 సీట్లలో ఎన్‌పిపి విజయ దుందుభి మోగించింది. సమీప ప్రత్యర్థి సజిత్‌ ప్రేమదాస నేతృత్వంలోని సామాగి బలవేగయా (ఎస్‌జెబి) 40 సీట్లకే పరిమితమైంది. మిగతా పార్టీలేవీ సింగిల్‌ డిజిట్‌ దాటలేదు. ఎన్‌పిపి ప్రభంజనానికి డజనుకు పైగా మాజీ మంత్రులు మట్టి కరిచారు. దేశాధ్యక్షులు అనూర కుమార దిసనాయకె ఆర్థిక, రాజకీయ రంగాల్లో తేనున్న మార్పులకు శ్రీలంక ప్రజలు పూర్తి మద్దతు పలికారు. తమిళులు అధికంగా ఉండే ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో సైతం ఎన్‌పిపి స్పష్టమైన ఆధిక్యత సాధించడం ద్వారా తనపై ఉన్న సింహళ జాతీయవాది అన్న ముద్ర తొలగించుకున్నట్లైంది. ఎన్నికల ప్రచారంలో ఒక జాతికి వ్యతిరేకంగా మరొక జాతిని ఎగదోసే విచ్ఛిన్నకర రాజకీయాలకు కాలం చెల్లిందని, దేశం ముందున్న గడ్డు సవాళ్లను అందరం కలసి ముందుకు సాగుదామని దేశాధినేత దిసనాయకె ఇచ్చిన పిలుపునకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. అలాగే దేశ ఆర్థిక, రాజకీయ రంగాల్లో వినూత్న మార్పులు తెచ్చేందుకు తనకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజార్టీ ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తిని మన్నించి అసాధారణ విజయం చేకూర్చారు. ‘బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లు అవుతాయ’న్న నానుడి నిజం చేస్తూ గత పార్లమెంటు ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన లెఫ్ట్‌ కూటమి ఈ సారి 160 సీట్లు (దామాషా పద్ధతిలో లభించిన సీట్లను కూడా కలుపుకుని) సాధించగా, గత పార్లమెంటులో 145 స్థానాలు కలిగివున్న మాజీ దేశాధ్యక్షులు మహిందా రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్‌ ఫ్రంట్‌ ఈసారి రెండు సీట్లతో సరిపెట్టుకుంది. గత సారి 54 స్థానాలు సాధించిన సామాగి జన బలవేగయా (ఎస్‌జెబి) పార్టీ ఇప్పుడు 40 స్థానాలతో సరిపెట్టుకుంది. రెండవ అతి పెద్ద పార్టీ అదే కాబట్టి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక దేశాధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పూర్వ అధ్యక్షులు రణిల్‌ విక్రమ సింఘె పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే సాహసం చేయలేదు. ఆయన నాయకత్వంలోని డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ పోటీ చేసి నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. మరో మాజీ అధ్యక్షులు మహింద రాజపక్సె పార్టీకి రెండు సీట్లు మాత్రమే దక్కాయి.1948లో బ్రిటిష్‌వారి నుండి స్వాతంత్య్రం పొందిన తరువాత గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతూ వచ్చిన ప్రధాన సాంప్రదాయక పార్టీలకు ప్రజలు కీలెరిగి వాత పెట్టారు. 2002లో శ్రీలంకను కుదిపేసిన మహా ఆర్థిక సంక్షోభానికి ఈ పార్టీలు అనుసరించిన నయా ఉదారవాద విధానాలే కారణం. దీనికి ప్రత్యామ్నాయంతో ముందుకొచ్చిన జనతా విముక్తి పెరమున (జెవిపి) నేత అనూర కుమార దిసనాయకెపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. మార్పు కోసం అధ్యక్ష ఎన్నికల్లో ఎన్‌పిపికి చారిత్రాత్మక విజయం చేకూర్చిన ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం చేకూర్చారు.

ఈ జంట విజయాలతో దిసనాయకె ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నేడు శ్రీలంక ముందున్న అతి పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక విధానాల్లో మార్పులు తెస్తామని, పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రభుత్వ వృథా వ్యయాన్ని అరికట్టి అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ఎన్నికల ప్రచారంలో దిసనాయకె హామీ ఇచ్చారు. వాటిని నిలబెట్టుకోవడంపైనే ఎన్‌పిపి భవిష్యత్తు ఆధారపడి ఉంది. 2019లో ఏర్పాటైన ఎన్‌పిపికి పార్లమెంటులో తిరుగులేని మెజార్టీ ఉన్నందున ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా దిసనాయకె తన ప్రజానుకూల ఎజెండాతో ముందుకు సాగాలి. ఇప్పుడాయన ముందున్న మొదటి సవాల్‌ 290 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్‌ బెయిలవుట్‌ ప్రణాళికను తిరగదోడడం. అలాగే భారత్‌, చైనాలతో సంబంధాల్లో సమతూకం పాటించడం కూడా విదేశాంగ విధానంలో ఒక ముఖ్యమైన అంశం. శ్రీలంకలో 2.1 కోట్ల మంది జనాభాకు గాను 1.7 కోట్ల మంది నమోదయిన ఓటర్లు ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం మంది ఓటువేయగా, ఇప్పుడీ ఎన్నికల్లో 70 శాతానికి ఓటింగ్‌ పడిపోయింది.

 

మొత్తం స్థానాలు 225

 

సాధారణ మెజార్టీ – 113

నేరుగా ఎన్నిక జరిగిన స్థానాలు : 196

దామాషా పద్దతిన ఎన్నిక జరిగినవి : 29

జెవిపి నేతృత్వంలోని ఎన్‌పిపి : 159

జెఎస్‌బి : 40

ఇతర పార్టీలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం